• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments

దేశంలో క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక కార్య‌క‌లాపాలు స్తంభించిన విష‌యం విదిత‌మే. ఈ ఏడాది మార్చి నుంచి ఆగష్టు వరకు మారటోరియం కొనసాగించారు. సెప్టెంబర్ నుంచి మారటోరియం ఎత్తివేయడంతో తిరిగి లోన్ల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. కరోనా కారణంగా లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయారు. తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు తలెత్తాయి.ఈ క్ర‌మంలో మార‌టోరియం స‌మ‌యంలో వ‌డ్డీ మాఫీ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. రుణాల మార‌టోరియం రెండేళ్ల వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర‌ ప్రభుత్వం తరపున‌ వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మార‌టోరియం పొడిగింపునకు సంబంధించి బ్యాంకుల‌తో ఆర్బీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ని, ఇక కేంద్రం కూడా ఆర్థిక సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్న‌ట్లు తుషార్ మెహెతా కోర్టుకు విన్న‌వించారు. రుణాల తాత్కాలిక నిషేధ స‌మ‌యంలో వ‌డ్డీని ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని కేంద్రం పేర్కొంది. ఈ విష‌యంలో న్యాయంగా ఆలోచించాల‌ని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. విచార‌ణ‌ను ఎక్కువ ఆల‌స్యం చేయ‌ద‌లుచుకోలేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. బుధ‌వారం పూర్తిస్థాయిలో వాద‌న‌లు వింటామ‌ని జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ ధ‌ర్మాస‌నం తెలిపింది. పిటిష‌న్‌పై విచార‌ణ‌ను కోర్టు రేప‌టికి వాయిదా వేసింది.ఈ కేసులో ప్రధానంగా మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ చెల్లింపులు ఉండరాదని, వడ్డీపై వడ్డీని వసూలు చేయరాదన్న అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అన్ని రకాల రుణాలపై 6 నెలల మారటోరియం వెసులుబాటును కల్పించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యవధిలో వాయిదా వేసుకున్న ఈఎంఐలపైనా బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తున్నారని ఆగ్రా వాసి గజేంద్ర శర్మ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!